Index

కీర్తనల గ్రంథము - Chapter 24

1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే. 
2 ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను. 
3 యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? 
4 వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. 
5 వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును. 
6 ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.) 
7 గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి. 
8 మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. 
9 గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి. 
10 మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే.ఆయనే యీ మహిమగల రాజు.