Index

సామెతలు - Chapter 26

1 ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. 
2 రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును. 
3 గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము. 
4 వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్య కుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు. 
5 వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. 
6 మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమా నుడు. 
7 కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును 
8 బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు. 
9 మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలో ముల్లు గుచ్చుకొన్న ట్లుండును. 
10 అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖునివలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును. 
11 తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు. 
12 తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు. 
13 సోమరిదారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును. 
14 ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును. 
15 సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును. 
16 హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును 
17 తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు. 
18 తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు 
19 తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు. 
20 కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును. 
21 వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. 
22 కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును. 
23 చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము. 
24 పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. 
25 వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మ కుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు. 
26 వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. 
27 గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును. 
28 అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషిం చును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.